దర్జా గా కబ్జా
ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా - అడిగితే అధికార పార్టీలో బడానేతల పేర్లు చెబుతున్న కబ్జాదారులు

రాజభారత్ న్యూస్, జగ్గయ్యపేట, (18 సెప్టెంబరు 2025) : జగ్గయ్యపేట నియోజకవర్గం, ముఖ్యంగా పట్టణంలో ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ చేయించుకొని మా ప్లాట్లు భద్రంగా ఉన్నాయని భ్రమ పడుతున్న ప్రజలారా మేల్కొనండి. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జాదారులు మీ ఫ్లాట్లను కబ్జా చేసే అవకాశం ఉంది. కొత్తగా అధికార పార్టీలో చేరిన నాయకులు కానీ నాయకులు కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది క్రింది స్థాయి నాయకులను కలుపుకొని ఖాళీ స్థలం కనిపిస్తే అది ప్రభుత్వ భూమా, రిజిస్ట్రేషన్ ప్లాటా, మున్సిపల్ పార్కు స్థలమా అనేవి తెలుసుకోకుండానే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, గతంలో ఇక్కడ పనిచేసిన అవినీతి రెవెన్యూ అధికారితో గతంలో మంజూరు చేసినట్లుగా పాత తేదీలతో దొంగ పొజిషన్ సర్టిఫికెట్లు సృష్టించి ప్లాట్ లను కబ్జా చేస్తున్నారు. ఎవరైనా అడిగితే అధికార పార్టీలో బడా నేతల పేర్లు చెబుతూ అధికార పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కావడం చేత పలువురు అధికారులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి సివిల్ వివాదాల్లో సైతం తల దూర్చి అసలైన యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే కబ్జాదారులకు భయపడి భూములు, ప్లాట్లు కొనుగోలు చేయకపోతే రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యే అవకాశం ఉంది. చివరకు రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు స్పందించి కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలలో అబాసు పాలయ్యే అవకాశం ఉంది.
What's Your Reaction?






